వీకెండ్ ఎం చెయ్యాలి అని వీక్ మొదటి నుంచి ఆఫీస్ లో పని చెయ్యకుండా కొంత మంది తెగ ప్రణాళికలు వేసేస్తుంటారు. అలాంటి వాళ్ళలో నేను ఒకడ్ని. ప్రణాలికలు అయితే పంచవర్ష ప్రణాలికలలా సోమ - శుక్ర వారం వరకు వేస్తా కాని చివరాకరున ఇండియన్ బౌలర్స్ లా చేతులెత్తేస్తా. ఆదివారం రోజున పొద్దున క్రికెట్ ఆడేసి మళ్ళి మళ్ళి ఇది రాని రోజు అని, మధ్యాహ్నం భోజనం చేసి కరిగిపోయాను కర్పూర వీణ లా అని , ఇంకా సాయంత్రం చిలుకా క్షేమమా అంటూ రోడ్ల వెంబడి తిరగాలి అని డిసైడ్ అయ్యా. కాని ఆదివారం ముందు వచ్చే శనివారం నా పాలిట శని దాపురిస్తుంది అనుకోలేదు. అప్పుడెప్పుడో Naukriలో విత్తనం నాటితే అది మొలకై , చెట్టై ఈ వారం కా(ల్)యగా వచ్చింది.

సరే అని షు వేసి, టక్ చేసి, సెంట్ కొట్టి రయ్యి మని ఇంటర్వ్యూ కి వెళ్ళా. గంగూలీ బాట్టింగ్ లా అలా వెళ్లి ఇలా వచ్చేయచ్చు అనుకున్నా కాని పానెల్ లో ఉన్న అతను ను మొదట సారి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉన్నాడు కాబోలు ఎంతకీ నన్ను వదలను అంటున్నాడు. తెగ ముచ్చటపడి అడిగేస్తున్నాడు. నేను మొహమాటపడి, తనని కష్ట పెట్టటం ఇష్టం లేక నాకు వచ్చింది, రానిది , తెలిసింది తెలియనిది , చేసింది చేయనిది కలిపి వినిపించేసా. కాసేపు అయ్యాక పాపం భయపడ్డాడో లేక బాధపడ్డాడో కాని నెక్స్ట్ రౌండ్ కి వెయిట్ చెయ్యి అన్నాడు. " గెట్ బ్యాక్ టో యు " అనటం విని విని విసిగిపోయిన నేను "నెక్స్ట్ రౌండ్" వినటంతోటే అక్తర్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన బాలాజీ లా ఎగిరి గంతేసా.

కట్ చేస్తే ... నేను ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ముందు తేలా. ఆయన సీరియస్ గా ఒక పేపర్ చేతికి ఇచ్చి సుడొకో గేమ్ కి కోడ్ చక చక అయిదు నిమిషాల్లో రాయి అన్నాడు. పుట్టి బుద్దెరిగి కేబోర్ద్ చేత బట్టినప్పటినుంచి అయిదు లైన్ల కోడ్ రాసి ఎరగని నేను అయిదు నిమషాల్లో సుడొకో కి కోడ్ రాయాలా !!! నేను రాయ ( లే ) ను పో అనేసి వచ్చేసా. అలా వచ్చిన నేను మరుసటి రోజు చూడాలి ఆనుకున్న ఎ సినిమాను చూడకుండా, క్రికెట్ ఆడకుండా గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా అనుకుంటూ గడిపేసా.


నోట్: టైటిల్ కి నా పోస్ట్ కి ఎం సంబంధం లేదు. ఒక వేళ టైటిల్ లోని పదాల గురించి మీరు చెప్పాలి అనుకుంటే నాకు సంబంధం లేదు.