వీకెండ్ ఎం చెయ్యాలి అని వీక్ మొదటి నుంచి ఆఫీస్ లో పని చెయ్యకుండా కొంత మంది తెగ ప్రణాళికలు వేసేస్తుంటారు. అలాంటి వాళ్ళలో నేను ఒకడ్ని. ప్రణాలికలు అయితే పంచవర్ష ప్రణాలికలలా సోమ - శుక్ర వారం వరకు వేస్తా కాని చివరాకరున ఇండియన్ బౌలర్స్ లా చేతులెత్తేస్తా. ఆదివారం రోజున పొద్దున క్రికెట్ ఆడేసి మళ్ళి మళ్ళి ఇది రాని రోజు అని, మధ్యాహ్నం భోజనం చేసి కరిగిపోయాను కర్పూర వీణ లా అని , ఇంకా సాయంత్రం చిలుకా క్షేమమా అంటూ రోడ్ల వెంబడి తిరగాలి అని డిసైడ్ అయ్యా. కాని ఆదివారం ముందు వచ్చే శనివారం నా పాలిట శని దాపురిస్తుంది అనుకోలేదు. అప్పుడెప్పుడో Naukriలో విత్తనం నాటితే అది మొలకై , చెట్టై ఈ వారం కా(ల్)యగా వచ్చింది.

సరే అని షు వేసి, టక్ చేసి, సెంట్ కొట్టి రయ్యి మని ఇంటర్వ్యూ కి వెళ్ళా. గంగూలీ బాట్టింగ్ లా అలా వెళ్లి ఇలా వచ్చేయచ్చు అనుకున్నా కాని పానెల్ లో ఉన్న అతను ను మొదట సారి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉన్నాడు కాబోలు ఎంతకీ నన్ను వదలను అంటున్నాడు. తెగ ముచ్చటపడి అడిగేస్తున్నాడు. నేను మొహమాటపడి, తనని కష్ట పెట్టటం ఇష్టం లేక నాకు వచ్చింది, రానిది , తెలిసింది తెలియనిది , చేసింది చేయనిది కలిపి వినిపించేసా. కాసేపు అయ్యాక పాపం భయపడ్డాడో లేక బాధపడ్డాడో కాని నెక్స్ట్ రౌండ్ కి వెయిట్ చెయ్యి అన్నాడు. " గెట్ బ్యాక్ టో యు " అనటం విని విని విసిగిపోయిన నేను "నెక్స్ట్ రౌండ్" వినటంతోటే అక్తర్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన బాలాజీ లా ఎగిరి గంతేసా.

కట్ చేస్తే ... నేను ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ముందు తేలా. ఆయన సీరియస్ గా ఒక పేపర్ చేతికి ఇచ్చి సుడొకో గేమ్ కి కోడ్ చక చక అయిదు నిమిషాల్లో రాయి అన్నాడు. పుట్టి బుద్దెరిగి కేబోర్ద్ చేత బట్టినప్పటినుంచి అయిదు లైన్ల కోడ్ రాసి ఎరగని నేను అయిదు నిమషాల్లో సుడొకో కి కోడ్ రాయాలా !!! నేను రాయ ( లే ) ను పో అనేసి వచ్చేసా. అలా వచ్చిన నేను మరుసటి రోజు చూడాలి ఆనుకున్న ఎ సినిమాను చూడకుండా, క్రికెట్ ఆడకుండా గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా అనుకుంటూ గడిపేసా.


నోట్: టైటిల్ కి నా పోస్ట్ కి ఎం సంబంధం లేదు. ఒక వేళ టైటిల్ లోని పదాల గురించి మీరు చెప్పాలి అనుకుంటే నాకు సంబంధం లేదు.


శ్రీ శ్రీ శతజయంతి ఉత్సవాలు డిసెంబర్ 20, 2009 బెంగలూరు వయ్యలికావాలి లో జరిగింది(ఇప్పటికి రాయటానికి సమయం దొరికింది- సందర్భం కూడాను :) ). ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి వాళ్ళ సహకారంతో తెలుగు విజ్ఞాన సమితి వారు నిర్వహించారు. దీనిలో కాకరాల, తంగిరాల వెంటక సుబ్బారావు, అద్దేపల్లి రామమోహన రావు, అంపశయ్య నవీన్, ద్వానా శాస్త్రి, శివారెడ్డి, కొసరాజు, మృణాలిని మొదలైన పెద్దలు పాల్గొన్నారు. మొత్తం పద్దెనిమిది మంది వక్తలు శ్రీ శ్రీ రాసిన కవితలు , కథలు , నాటికలు , అనువాదాలు అన్నింటి పైన ప్రసంగించారు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన సమయం పదినిమిషాలు మాత్రం. కాబట్టి ఆ సమయంలోనే విషయం పూర్తిగా చెప్పడానికి కుదరలేదు. ఇది కొంత అసంతృప్తి. కాని వీళ్ళ వ్యాసాలూ పుస్తక రూపం లో తీసుక వస్తాం అని సాహిత్య అకాడెమీ ప్రాంతీయ అధికారి మినలోచని అన్నారు.

తంగిరాల వెంకట సుబ్బారావు గారు మాట్లాడుతూ శ్రీ శ్రీ, తిలక్, శేషేంద్ర లను ఆధునిక కవిత్రయంగ అభివర్ణించారు.

కవి శివారెడ్డి గారు మరో ప్రస్థానం గురించి మాట్లాడారు. శ్రీ శ్రీ ని కాలమే సృష్టించిన కవిగా అభిప్రాయపడ్డారు.

ఉస్మానియా ప్రొఫెసర్ సత్యం గారు మహా ప్రస్థానం గురించి ఆవేశంగా ప్రసంగిచారు. మార్క్సిజం ఒక జీవన విధానం అని అది మహాప్రస్థానం లో ఉంది అన్నారు.

మన్నవ భాస్కర్ గారు శ్రీ శ్రీ ని అక్షరాల లక్షాధికారి - మాటల కోటిస్వరుడుగా అభివర్ణించారు.

కొసరాజు గారు శ్రీ శ్రీ సినిమా పాటల గురించి మాట్లాడుతూ తెలుగువీర లేవరా పాట గురించి ప్రస్తావించారు. కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగిస్తే అది శ్రీ శ్రీ అని అన్నారు. ఆయన ప్రతి పాట ఎగిరే గాలిపటం అన్నారు.

కొప్పర్తి వెంకటరమణ మూర్తి గారు శ్రీ శ్రీ అనంతం గూర్చి మాట్లాడుతూ ఇది ఆత్మచరిత్ర-చారిత్రాత్మక చరిత్ర గా అభివర్ణించారు. సర్రియలిజం చదవడం కాదు ఆచరణలో పెట్టారు శ్రీ శ్రీ అంటూ శ్రీ శ్రీ ని, చలాన్ని మనం చాలా వాటికి క్షమించాలి అన్నారు

ఇంకా అంపశయ్య నవీన్ గారు శ్రీ శ్రీ నవలలు-కథల పైన, మృణాలిని గారు రేడియో నాటికలపైన, ఆశాజ్యోతి గారు ప్రశ్నలు -జవాబులు పైన ప్రసంగించారు.

చివర్లో మర్కండపురం శ్రీనివాస రావు అనే ఆయన (ప్రభుత్వ అధికారి -బెంగలూరు లో ) కన్నడ లో ప్రసంగించారు. ఈయన గారు మహా ప్రస్థానాన్ని కన్నడం లో అనువాదించారట . ఈయన శ్రీ శ్రీ గురించి మాట్లాడటం కంటే తన గురించి చెప్పుకున్నదే ఎక్కువ. నాకు ఈయన ప్రసగిస్తున్నంత సేపు చిర్రెత్తి పోయింది.

శ్రీ శ్రీ కమ్యునిస్ట్ కవా?-కమ్యూనిజాన్ని నమ్మిన కవి.
శ్రీ శ్రీ కవిత్వం లక్షణం చెప్పారు కాని లక్ష్యం చెప్పలేదు.
శ్రీ శ్రీ వస్తు ప్రియుడా ? రూప ప్రియుడా ? మొదలైన ఎన్నో విషయాల పైన చర్చ జరిగింది.


ఒక ఫైన్ మార్నింగ్ అంటే తెల్లవారిజామున తొమ్మిదికి అని అర్థం అన్నమాట. నిద్ర లేచి నా మొహం నేను
అద్దంలో చూసుకున్నా. నామీద నాకే జాలి వేసింది. ఎందుకు అంటే పడుకోబోయే ముందు అనుష్క ఫోటో , నిద్ర లేచాక అజంతా ఫోటో చూడాలి అన్నది నాకు నేను పెట్టుకున్న నియమం. అనుష్క ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అజంతా అంటారా అమ్మో నేను చెప్పను. అనుష్కా ఫోటో చూస్తే కలలో తనతో ఎంచక్కా జుం జుం మాయ అని డాన్సు చేసుకోవచ్చు. ఉదయం లేవటం తోటే అజంతా ఫోటో చూస్తే ఆఫీస్ లో రోజు మొత్తం ..ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏముందిలే .. అనుకుంటూ ఉండచ్చు- ఇది విషయం. ఈ రోజు నియమం తప్పా ఎన్ని కష్టాలో అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరా. దార్లో వెళ్తూ వెళ్తూ దుఖసాగర్ ... అదే లెండి ఈ బెంగళూరు లో ఆనంద సాగర్, శాంతి సాగర్ సుఖసాగర్ లు ఎక్కువ. అలాంటి ఒక దుఃఖసాగర్ కి వెళ్ళా. సర్వర్ ని వేడిగా ఏమున్నాయి అని అడిగా. వాడి వాలకం చూస్తే ప్రకాష్ రాజ్ లా ఉన్నాడు కొంప తీసి నిప్పులు కానితేడు కదా అనుకున్న కాని పొంగల్ తెచ్చాడు. దానికి పెరుగు పచ్చడి కాంబినేషన్. హతవిధీ ... చట్ని , సాంబార్ లేదా అంటే ఇది ఇంతే ఇష్టం ఉంటే తిను లేదా బిల్లు కట్టి పో బే అన్నట్టు చూసాడు. సరే అని .. గ్లాసు లో నీళ్ళు గట గట తాగేసి పొంగలి + పెరుగు పచ్చడిని గ్లాసు లోకి వంచుకొని ఒక్క సారి తొడ కొట్టి నేనే కనుక తెలుగు బ్లాగారునైతే నాకేం జరగకుండు గాక ... జై చెన్న కేశవ అని ఆ ద్రావకాన్ని తాగేసా.

ఆఫీస్ లోకి వెళ్ళటం వెళ్ళటం మా మేనేజర్ మొహం చూసా. తనేమో కింగ్స్ ఎలెవెన్ ఓనర్ ప్రీతి జింటా లా మొహం వేలాడేసుకొని ఉన్నాడు. పలకరిస్తే విలపిస్తాడేమో అని అనుమానం వేసి నా సీట్ లో వెళ్లి కూర్చొన్న. టైం చూస్తే పదిన్నర. కాసేపు వర్క్ చేసుకుందాం అని ఆర్కుట్, జి టాక్, పేస్ బుక్, యాహో ఓపెన్ చేశా. అంతలో మేనేజర్ పిలిచి పన్నెండింటికి కాల్ ఉంది అన్నాడు. ఎవరి తో ఎం విషయం అని డిటిల్స్ నేను అడగలేదు. ఆహా ఏముంది లే రోజు ఉండే తంతు కదా స్టేటస్ అడుగుతాడేమో అని, వారం క్రితం చేసిన వర్క్, వారం తరువాత చేయబోయే వర్క్ అన్ని ఈ రోజే చేసినట్టు ఒక్క ఎక్సెల్ షీట్ లో కుక్కి రెడి చేసి ఉంచా.

సమయం పన్నెండు అయింది. కాల్ మొదలయింది. నాకు నిద్ర వచ్చింది. ఎప్పుడు కాల్ లో చేసే పనే చివర్లో కూర్చొని ఎంచక్కా అనుష్క ఫోటోలు చూస్తూ నిద్ర లోకి జారుకున్న. కాసేపటికి చూస్తే మా మేనేజర్ అరుచుకుంటూ పక్క రూం కి వెళ్తున్నాడు. కొంపతీసి అనుష్క తో నా డాన్సు చూసేసాడా అనుకుంటూ వెళ్లి ఏంటి సార్ విషయం అని అడిగా. మేనేజర్ వెక్కి వెక్కి ఏడుస్తూ ... వెనకటికి ఎవడో తారకరత్న దగ్గరికి వెళ్లి వాడి సినిమా లో వేషం అడిగాడట అలా ఉంది ఇక్కడ నేను ప్రాజెక్ట్స్ లేక ఏడుస్తుంటే ఆ ఎదవ నన్ను ప్రాజెక్ట్స్ అవుట్సోర్స్ చెయ్యమంటాడు అని కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇక లాభం లేదు అనుకొని నేను నా సీట్ దగ్గరకి వచ్చి Naukri ఓపెన్ చేసి నింపడం మొదలెట్టా.

వారెవ్వా ఏమి ఫేసు అచ్చం ... ఛి ఛి ..
నమస్తే ...

తొలకరి జల్లులా
మొదటి సిగరెట్ పఫ్ లా
మొదటి బీర్ సిప్ లా
నా మొదటి టపా.

హి హి పోలిక బాలేదు కదా హ్మం .. అర్థం చేసుకోరూ.. మొదటి టపా కదా అంతే.


గమనిక : టైటిల్ లో చెప్పిన పదానికి సంధి పేరు ఏంటి ? ;)